వృత్తి ధర్మమా, ప్రాణాలతో చెలగాటమా?: బివిఎస్ భాస్కర్ | |
వృత్తి ధర్మమా, ప్రాణాలతో చెలగాటమా ?
క్షేత్ర స్థాయిలో ప్రతి జర్నలిస్టుకూ సొంత అనుభవాలుంటాయి. చాలామంది సహోద్యోగులతోనో అత్యంత సన్నిహితులతోనో ఆ అనుభూతులు పంచుకుంటారు. సామాన్య ప్రజలకు మాత్రం ఇవి మరింత ఆసక్తికరంగా ఉంటాయి. జర్నలిస్టులకు వార్తలు ఎలా తెలుస్తాయి, వాళ్ళు వార్తలు సేకరించి తెచ్చే పద్ధతి సినిమాల్లో చూపించినట్టుగానే ఉంటుందా అనే విషయాలు తెలుసుకోవాలనిపిస్తుంది. నా విషయానికొస్తే, ఆ ఘట్టం తలుచుకుంటేనే వెన్నులో వణుకుపుడుతుంది. ఒక అగ్రస్థాయి పీపుల్స్ వార్ నాయకుడితో ఇంటర్వ్యూ కోసం వెళ్ళి పోలీసుకాల్పుల మధ్య ఇరుక్కున్న ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా.
యాజమాన్యం మీద కోర్టుకెక్కి నేను కేసు గెలిచినందుకు అప్పటి ఆంధ్రప్రభ సంపాదకులు ఉక్రోషంతో నాకు వేసిన శిక్ష బదిలీ. అలా 1999 చివర్లో నన్ను నిజామాబాద్ కు బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులిచ్చారు. నక్సల్ కార్యకలాపాలు చురుగ్గా ఉండే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో పత్రికల్లో చదవటమే కాదు, నా జర్నలిస్టు మిత్రులద్వారా అప్పటికే నిజమైన కథలు ఎన్నో విన్నా. రోజూ రాత్రి పది లోపే నిద్రపోవాలని, సాయుధ పోలీసు దళాల వాహనాలు చుట్టూ తిరుగుతూనే ఉంటాయని, ఏమాత్రం అనుమానం వచ్చినా ఇంటరాగేషన్ పేరుతో ఈడ్చుకెళ్ళి వేధిస్తారని చెప్పేవారు. తెల్లవారితే ఎదురుకాల్పుల వార్తలు వినాల్సి వస్తుందనీ తెలుసుకున్నా. నేనూ మా ఆవిడా కాసేపు పునరాలోచనలో పడ్డాం. మొత్తానికి వెళ్ళాలనే నిర్ణయించుకున్నాం.
కొత్తశతాబ్దికి స్వాగతం పలికేవేళ.... 2000 సంవత్సరం జనవరి 1 న విధుల్లో చేరా. ఆంధ్రభూమి నిజామాబాద్ సీనియర్ రిపోర్టర్ శివకుమార్ (ఇప్పటికీ ఆంధ్రభూమిలోనే పనిచేస్తూ ఒంగోలు లో ఉన్నారనుకుంటా) నక్సల్స్ వార్తలు, పోలీసుల ప్రకటనలు రాసేటప్పుడు ఎలా సంయమనం పాటించాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పాడు. అవకాశం వస్తే ఎవరైనా పీపుల్స్ వార్ పెద్ద నాయకుణ్ణి ఇంటర్వ్యూ చేస్తే నాణేనికి అవతలివైపు ఏమిటో తెలుస్తుందని కూడా నాకో సలహా ఇచ్చాడు.
ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. ఎవరో ఒక ఆగంతకుడు నా లాండ్ లైన్ ఫోన్ కి కాల్ చేశాడొకరోజు. అప్పటికింకా మాకు మొబైల్ ఫోన్లు అందుబాటులోకి రాలేదు. “అన్న కొంతమందితో మాట్లాడాలనుకుంటున్నాడు” సూటిగా చెప్పాడతను. నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా “ రాత్రికి కామారెడ్డి రండి” అని ఫోన్ పెట్టేశాడు. శివకుమార్ చెప్పిన ఇంటర్వ్యూ పిలుపులాంటిది ఇదేనని అప్పుడు నాకర్థమైంది. అప్పుడు మధ్యాహ్నం 2గంటలైంది. అతగాడు చెప్పిన కొంతమందిలో మా శివకుమార్ ఉన్నాడేమే కనుక్కుందామని ఫోన్ చేశా. ఇలా కనుక్కోవటానికి ఇంకా ఎవరికీ ఫోన్ చేయలేదుగదా? అనడిగాడు. లేదన్నాను. ఎవరికీ చెప్పవద్దని గట్టిగా చెప్పాడు. తానూ వస్తున్నానన్నాడు.
ఇద్దరం సాయంత్రం 7 గంటలకల్లా కామారెడ్డి చేరుకున్నాం. కరీంనగర్ వార్తలో పనిచేసే ఇంకో జర్నలిస్ట్ మిత్రుడు ఎడమ సమ్మిరెడ్డి కూడా కామారెడ్డి బస్టాండ్ పక్కన మేమున్న చోటుకే వచ్చాడు. అప్పటికే అతడికి నక్సల్స్ ఉద్యమం పట్ల బాగా అవగాహన ఉన్నదని కొంతమంది నాయకులను ఇంటర్వ్యూ చేశాడని అతడి మాటలని బట్టి అర్థమైంది. ఇంకేముంది? ఇప్పుడు సమ్మిరెడ్డి మాకు నాయకుడయ్యాడు. అలా మాకు ఫోన్ చేసిన వ్యక్తి చెప్పిన చోట మేం ఎదురుచూస్తూనే ఉన్నాం. నిజానికి అతనొక కొరియర్ అని ఆ తరువాత తెలిసింది. నా జర్నలిస్టు మిత్రులు శివకుమార్, సమ్మిరెడ్డి చెరో సిగిరెట్ పాకెట్ ఖాళీచేసేంత సేపు అలా నిలబడి ఎదురుచూస్తూనే ఉన్నాం.
చెప్పిన సమయానికి గంట ఆలస్యంగా లుంగీ కట్టుకున్న ఓ పల్లెటూరి కుర్రాడు మా దగ్గర కొచ్చాడు. “నేను ఫోన్ చేసింది మీకేనా?” అనడిగాడు. మేం అవునన్నాం. “ ఆ ఎదురుగా ఉన్న మెడికల్ షాపుకెళ్ళి శారిడాన్ గోలీ అడగండి” అని చెప్పేసి తన మానాన తాను వెళ్ళిపోయాడు. నాకు చిర్రెత్తుకొచ్చింది. ఇంతసేపు నిలబడినందుకు కాళ్ళనొప్పు లొచ్చి ఉంటాయని వెటకారంగా అన్నాడేమోననిపించింది. వెంటనే కోపం ఆపుకోలేక శివకుమార్ తో అనేశా, “శివన్నా, ఏంటా పిచ్చిమాటలు? ఇంటర్వ్యూ అని పిలిపించి ఇంతసేపు నిలబెట్టి ఇప్పుడు తీరా వచ్చి కూడా మనతో వెటకారాలాడుతున్నాడు? “ అని.
నాకు సమాధానం ఇవ్వకుండా సమ్మిరెడ్డి, శివకుమార్ ఇద్దరూ ఆ కుర్రాడు చెప్పినట్టే మెడికల్ షాపుకెళుతుంటే గత్యంతరం లేక అయోమయంగా నేనూ వాళ్ళ వెంటే వెళ్ళా. వీళ్ళిద్దరూ ఆ కుర్రాడు చెప్పినట్టే మెడికల్ షాపులో శారిడాన్ అడిగారు. వెంటనే ముగ్గురు మనుషులు బయటికొచ్చి మమ్మల్ని వాళ్ళవెంట రమ్మన్నారు. శారిడాన్ అడగటం కోడ్ భాషలో భాగమని అప్పుడర్థమైంది నాకు. అలా ఒక మట్టి రోడ్డులో వాళ్ళని అనుసరించాం. అలా నడుస్తూ ఉండగా ఆ ముగ్గురి నడుములకూ చొక్కాలకింద వేలాడుతూ ఉన్న రివాల్వర్లు కనిపించాయి నాకు. వాళ్ళు ఆ అగ్రస్థాయి పీపుల్స్ వార్ నాయకుడి సహాయకులు అయి ఉంటారని అనిపించింది. వాళ్ళు మిలీషియా సభ్యులని ఆ తరువాత తెలిసింది.
అప్పటికే రాత్రి 10 గంటలైంది. మాకు ఆకలి దంచేస్తోంది. ఇంకో రెండు కిలోమీటర్లు నడిచాక చిన్న పల్లె ఒకటి వచ్చింది. దూరంగా విసిరేసినట్టున్న ఒక ఇంటికి చేరుకున్నాం. అక్కడ మమ్మల్ని కాసేపు ఆగమన్నారు. ఆ ఇంట్లో ఒక ముసలి జంటతోబాటు ఒక పాప ఉంది. వాళ్ళ మనవరాలు అయి ఉండాలి. వాళ్ళు అప్పుడే తినబోతున్నారు. మాకు ఆకలి మరింత పెరిగింది. కడుపులో ఎలుకలు పరిగెత్తుతున్నాయి. బహుశా వాళ్ళ భోజనాలయ్యాక ఆ ముసలావిడ వండిపెడుతుందేమోననుకున్నాం. కానీ అలాంటి ఆనవాళ్ళేమీ కనబడలేదు. ఏం జరుగుతున్నదో అర్థం కాలేదు. మమ్మల్ని అక్కడ వదిలేసి వెళ్ళిన ముగ్గురు గన్ మెన్ ఇంకో గంట సేపటి తరువాత తిరిగొచ్చారు. ఒకే ఒక్క బ్రిటానియా బిస్కెట్ పాకెట్ తెచ్చారు... అదే మహాప్రసాదమన్నట్టు. ముగ్గురికీ అరికాలి మంట నెత్తికెక్కింది. నడకవల్ల అలసటకు ఆకలి కూడా తోడయింది. కానీ మరోమార్గం లేదు. వచ్చినపని త్వరగా ముగించుకొని వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. త్వరగా ’అన్న’ ఉండే చోటుకు తీసుకెళ్ళమన్నాం.
అసలు కథ అక్కడే మొదలైంది. పట్టణాల్లో ఉండేవాళ్ళు పెద్దగా నడవరు. నడకపేరుతో నడిచినా చదునైన మైదానాల్లో నడుస్తారు. రాత్రి పొద్దుపోయేదాకా పనిచేసే జర్నలిస్టులు నిద్రలేచేసరికి బారెడు పొద్దెక్కుతుంది కాబట్టి ఆరోగ్యం కోసం నడిచే ఆలోచనకు అక్కడే బ్రేక్ పడుతుంది. (ఈ మధ్య జర్నలిస్టులకు ఆరోగ్య స్పృహ ఎక్కువై ఒక్కొక్కరూ ఒక్కో మిల్కా సింగ్ లా మారిపోతున్నారనుకోండి). అలా ఆ ముగ్గురు ’ మార్గదర్శకులు ’ పొలాల్లో ఎగుడుదిగుడు నేలమీద నడుస్తూ వాళ్లను అనుసరించమన్నారు. అదృష్టం కొద్దీ మా ముగ్గురికీ షూస్ ఉండటం వల్ల ఎక్కువ ఇబ్బంది పడకుండానే ముందుకు సాగుతున్నాం. అలా ఓ గంట గడిచాక అకస్మాత్తుగా వాన మొదలైంది. భారీవర్షానికి ఈదురుగాలులూ తోడయ్యాయి. వర్షానికి ఆ నల్లరేగడి నేలలో నుంచి తేళ్ళు, పాములు బయటి కొచ్చాయి. పూర్తిగా తడిసిపోయాం... వణికించే చలి, నేలమీద బురద... షూ విప్పి చేత్తో పట్టుకోవాల్సి వచ్చింది. ’ అన్న’ ను కలుసుకోవటానికి ఇంకెంతదూరం వెళ్ళాలని అడిగితే, “అన్నా. ఇదిగో గిదేనే.. గాడ చెట్టున్నదే.. గాడనే..” అనేవాళ్ళు.
అకస్మాత్తుగా దూరాన్నుంచే మామీద ఒక ఫోకస్ లైట్ పడింది. ఆరుగురం అక్కడికక్కడే ఆగిపోయాం. మాతో ఉన్న ముగ్గురు సాయుధ గెరిల్లాలు మమ్మల్ని కిందికి వంగమన్నారు. చొక్కాలూ, బనియన్లూ తీసెయ్యమన్నారు. మాకంతా అయోమయంగా ఉంది. చెప్పినట్టు చేశాం. పోలీసులు చుట్టుముట్టి ఉంటారన్నది వాళ్ళ అనుమానం. మా గమ్యస్థానానికి చేరువవుతుండగానే కుంభవృష్టి కురిసింది. ఒకచోటకు చేరగానే కొన్ని నల్లటి ఆకారాలు మాకు ఇరువైపులా లేచి నిలబడ్డాయి. పై ప్రాణాలు పైనే పోయినట్టనిపించింది. ఆ ఆకారాలు తమను కప్పి ఉంచిన నల్లటి ప్లాస్టిక్ కాగితాలను పాక్షికంగా తొలగించాక వాళ్ళు సాయుధ మహిళా నక్సల్స్ అని అర్థమైంది. మమ్మల్ని ఈడ్చుకెళ్ళినంత పనిచేశారు. కాసేపు ఆగమని చెప్పేసరికి మాకు పట్టరానంత కోపమొచ్చింది. అంతదూరం వానలో తడుస్తూ పొలాల్లో, బురదలో నడిచి తిండీ తిప్పలులేకుండా నిలబడే ఓపికకూడా లేకుండా వస్తే ఇంకా ఆగమని చెప్పడమేంటని గొడవకు దిగాం. మహిళా కమెండోలు చాలా సౌమ్యంగా జవాబిచ్చారు, “ అన్నా, మేం ఆడోళ్ళం.. ఎండా వానా పట్టింపు లేకుండా కొండలెక్కుతుంటాం, గుట్టల్లో దాక్కుంటాం.. ఇది మాకూ రోజూ మామూలే. ఒక్కరోజు 8 కిలోమీటర్లకే మీరట్లా అంటే ఎట్లా? “ అన్నారు. కానీ నిజానికి మాకు అదే చాలా ఎక్కువ. సిగ్గుపడి పైకి ఆమాట అనలేక పోయాం.
మొత్తానికి మాకు బాస్ నుంచి పిలుపొచ్చింది. మమ్మల్ని అక్కడినుంచి ఒక చిన్న గుడారం దగ్గరికి నడిపించారు. ముఖాలు గుర్తుపడితే చాలన్నట్టుగా కేవలం మూడు కొవ్వొత్తులు వెలిగించి ఉన్నాయక్కడ. SLR గన్ తో ఒక యువనాయకుడు, అతడి బాడీ గార్డులు ఆ చిన్న గుడారంలో ఉన్నారు. అంత ’శ్రమ’ కోర్చి, ’కష్ట’ పడి వచ్చినందుకు మాకు ధన్యవాదాలు చెప్పి అసలు విషయంలోకి దిగాడు ఉత్తరతెలంగాణ జోనల్ కమిటీ కార్యదర్శి అజాద్. నక్సల్ ఉద్యమం తీరుతెన్నులు, ప్రభుత్వ అణచివేత ధోరణి, పల్లెల్లో పేదప్రజల స్థితిగతులు వివరిస్తూ ఒక హిట్ లిస్ట్ కూడా విడుదలచేశాడు
ఇంటర్వ్యూ సాగుతుండగా అజాద్ మమ్మల్ని “భోజనం చేసారా?” అని అడిగాడు. మాకు ఏడుపొక్కటే తక్కువ. లేదని చెప్పాం. వెంటనే భోజనం తయారుచేసి తెమ్మని తన కమాండర్స్ కి చెప్పాడు. అప్పుడు సమయం అర్థరాత్రి 1.30. వేడివేడిగా ఒక మోస్తరు భోజనం దొరుకుతుందని ఆశపడ్డమాట నిజం. తీరా ’భోజనం’ తయారై వచ్చేసరికి అది లావు బియ్యపు అన్నం, గొడ్డుకారం. “ మీరైనా, మేమైనా ఇలా కారంతో ఎలా తినగలం? రోజూ ఇలాగే తింటారా?” అని నేనడిగితే, చాలా నింపాదిగా జవాబిచ్చాడాయన. “లేదు.. ఒక్కోరోజు ఇదీ ఉండదు” అని. మనసు వికలమైంది. ఆకలి చచ్చిపోయింది.... ఆ తిండి చూశాక, ఆయనమాటలు విన్నాక. పైగా వాళ్ళు వారానికి ఒకసారి తెచ్చుకునే సరకుల్లో నుంచి కొంతభాగం మాకోసం వాడారు. నేనూ, శివన్నా తినలేకపోయాం గాని సమ్మిరెడ్డి మాత్రం కాస్త ఎంగిలిపడ్డాడు.
మా ఇంటర్వ్యూ పూర్తవబోతుండగా ఒక కొరియర్ హడావిడిగా వచ్చి అజాద్ చెవిలో ఏదో చెప్పాడు. “ పోలీసులు చాలా దగ్గర్లో ఉన్నారు. మీరు వెంటనే ఇక్కణ్ణుంచి వెళ్ళిపోవాలి”అన్నాడు మాతో అజాద్. ”ఇంటర్వ్యూ కోసం మీరు ఇక్కడికి వస్తున్నట్టు ఎవరితోనైనా చెప్పారా”అని అడిగితే లేదన్నాం. నిమిషాల్లోనే అక్కడ మొత్తం సర్దేశారు. మా ముగ్గుర్నీ వదిలేసి టెంట్ తో సహా దళం సభ్యులందరూ మాయమయ్యారు. ఒక కొరియర్ మాత్రం మా కోసం మిగిలాడు. అంతలోనే మాకు అతి చేరువలో కాల్పుల శబ్దాలు వినిపించాయి. అక్కడిపొలాల్లో ఒక మూలగా నిప్పురవ్వలు కూడా కనిపిస్తున్నాయి.
మేం హడావిడిగా తిరుగుముఖం పట్టాం. ఈ కొరియర్ మమ్మల్ని మరో అడ్డ దారిలో తీసుకొచ్చి కామారెడ్డికి దగ్గరగా ఉండే హైవే మీదికి తీసుకొచ్చి వదిలిపెట్టి మాయమయ్యాడు. అప్పుడు తెల్లవారుజామున నాలుగవుతోంది. ఏదైనా వాహనం దొరుకుతుందేమోనని ఎదురుచూస్తుండగా ఒక పోలీసు జీపు వచ్చి మా దగ్గర ఆగింది. బురద కొట్టుకున్న మా బట్టలు చూస్తూ, “మీరు నక్సల్ నాయకుడి ఇంటర్వ్యూకి వెళ్ళివస్తున్నారా?” అని అడిగారు. లేదన్నాం. మొత్తానికి ఎలాగోలా నచ్చజెప్పి నిజామాబాద్ వెళ్ళాం.
కానీ కథ అంతటితో ఆగిపోలేదు. ఆ మాటకొస్తే అక్కడే మొదలైంది. ఉదయం పదిన్నరకు ఎస్పీ క్యాంప్ కార్యాలయం నుంచి ఫోనొచ్చింది. తమిళుడైన ఎస్పీ రవిశంకర్ అయ్యనార్ నాకు వ్యక్తిగతంగా కూడా బాగా తెలుసు. నాకు తమిళం వచ్చి ఉండటం వల్ల తరచు తమిళంలో పలకరించేవాణ్ణి. కొంపదీసి రాత్రి జరిగిన విషయమేమైనా తెలిసిందా అనుకుంటూనే ఏమీ ఎరగనట్టు వెళ్ళి ఆయనముందు కూర్చున్నా. మెల్లగా పలకరింపులతో మొదలెట్టి రాత్రి ఎక్కడున్నానో కూపీ లాగే ఇంటరాగేషన్ మొదలుపెట్టారు. నేను ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే “మీరు, మీ ఇద్దరు జర్నలిస్ట్ మిత్రుల ప్రతి కదలికా నాకు తెలుసు. మీరొక నక్సల్ నాయకుడి ఇంటర్వ్యూ కోసం వెళ్ళారు” అన్నారు. కాకపోతే ఆ నాయకుడెవరనేది ఆయనకు తెలియదని మాత్రం నాకర్థమైంది. మేం రహస్యంగా వెళ్ళిన పని వివరాలు ఆయన నోటివెంట వింటుంటే నాకు నోట మాటరాలేదు. చాలా ఆశ్చర్యపోయా. “ జీవితంలో అలా రిస్క్ తీసుకోకండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన జర్నలిస్టులు ఆ అడవిలో అక్కడే ఉన్నారని తెలిసి రాత్రి మేం కాల్పుల్లో సంయమనం పాటించబట్టి సరిపోయింది. లేకపోతే ఏమై ఉండేదో తెలుసా? “అన్నారు మందలింపు ధోరణిలో.
ఆయన అన్నట్టు మాది అత్యుత్సాహమా? దీన్ని విధినిర్వహణలో అనివార్యమైన రిస్క్ అనుకోవాలా? ఏమో! ఇదే నిజామాబాద్ జిల్లాలో నక్సల్స్ సమావేశమైనట్టు తెలిసి పోలీసులు అక్కడికి వెళుతుంటే ప్రత్యక్షంగా చూసి రిపోర్ట్ చేద్దామని వాళ్లతో బాటు వెళ్ళిన జర్నలిస్టు మల్లెపూల నరేంద్ర ఆ ఎదురుకాల్పుల్లో చిక్కుకొని చనిపోవటం గుర్తొచ్చిన క్షణాన మాత్రం వెన్నులో వణుకుపుట్టింది. వృత్తిధర్మం ప్రాణాలకంటే ఎక్కువకాదేమో!
-బివిఎస్ భాస్కర్
నెల్లూరులో పుట్టిపెరిగిన బివిఎస్ భాస్కర్ ఇంగ్లిష్ లోను, జర్నలిజం లోను పోస్ట్ గ్రాడ్యుయేట్. ఆంధ్రపత్రికతో మొదలై ఆంధ్రప్రభ, టైమ్స్ ఆఫ్ ఇండియా మీదుగా హిందూ(రాజమండ్రి) లో కొనసాగుతున్న ఆయన జర్నలిజం ప్రస్థానం రజతోత్సవం పూర్తిచేసుకుంది. ఆంధ్రప్రభలోఎడిటోరియల్ నుంచి రిపోర్టింగ్ కి మారాక ఆరేళ్ల బదలీల పర్వంలో ఐదు చోట్ల పనిచేయాల్సి వచ్చినా ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటూ ఇంగ్లిష్ జర్నలిజం అలవాటు చేసుకొని 2002 లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో చేరారు. 2005 నాటికి తాను ఎంతగానో ఇష్టపడే హిందూ పత్రికలో చేరి రాజమండ్రిలో కొనసాగుతున్నారు. గ్రామీణ సమస్యలు, సామాజిక అంశాలపట్ల ప్రత్యేకమైన ఆసక్తి కనబరచే భాస్కర్ హిందూ దినపత్రికలో రాసిన ప్రత్యేక వార్తాకథనాలను ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఒక గ్రంథంగా తీసుకురాబోతున్నది.
బివిఎస్ భాస్కర్ ఫోన్ నెం. 9441462666 ఈ మెయిల్: bhaskarbvs@gmail.com
|
Monday, April 29, 2013
వృత్తి ధర్మమా, ప్రాణాలతో చెలగాటమా?: బివిఎస్ భాస్కర్
Subscribe to:
Posts (Atom)